ఋతుస్రావం

గర్భాశయం లోపలి పొర కరిగి కారి పోవడమే ఋతుస్రావం. ఇది పునరోత్పాదక దశలో ఉన్న స్త్రీలలో, ఒక్క గర్భధారణ సమయం లో తప్పనించి, ఇంచు మించు నెల నెలా జరుగుతుంది. యుక్త వయస్సు వచ్చాక రజస్వల అయినప్పటి నుండీ ఋతుస్రావం మొదలై మెనోపాజ్ (ఋతు నివృత్తి) దశ లో పూర్తిగా ఆగిపోతుంది.


ఋతుచక్రం

ఋతుస్రావం మొదలైన రోజు నుండీ ఋతు చక్రం మొదలౌతుంది. ఇది ఒకటవ రోజుగా లెక్కిస్తారు. ఇది తదుపరి బహిష్టు కాలం మొదలయ్యే ముందు ముగుస్తుంది. సాధారణంగా ఋతు చక్రం 25 నుండి 36 రోజులు ఉంటుంది. ఒక్క 10-15 శాతం స్త్రీలలో మాత్రమే ఋతు చక్రం సరిగ్గా 28 రోజులు ఉంటుంది. మామూలుగా రజస్వల అయిన వెంటనే మరియు మెనోపాజ్ ముందు ఈ చక్రం లో తేడాలు అధికంగా ఉండి బహిష్టుల మధ్య వ్యవధి ఎక్కువగా ఉంటుంది.

menstrual1.jpg menstrual2.jpg

ఋతుస్రావం 3 నుండి 7 రోజుల వరకూ ఉంటుంది. అంటే సగటున 5 రోజులు ఉంటుంది. ఒక్కొక్క బహిష్టులో ½ నుండి 2 ½ ఔన్సుల రక్తం పోతుంది. రకాన్ని బట్టి ఒక్కొక్క సానిటరీ నాప్ కిన్ లేదా టాంపూన్ ఒక ఔన్స్ వరకూ రక్తాన్ని పీల్చుకో గలదు. దెబ్బ తగిలినప్పుడు వచ్చే రక్తం లాగ ఈ రక్తం సాధారణంగా గడ్డకట్టుకోదు (రక్త స్రావం అధికంగా ఉన్నప్పుడు తప్పనిచ్చి).

ఋతుచక్రాన్ని హార్మోన్లు నియంత్రిస్తూ ఉంటాయి. పిట్యూటరీ గ్రంధి (పీయుష గ్రంధి) ఉత్పన్నం చేసే ల్యుటినైజినంగ్ హార్మోన్ మరియు ఫాలికిల్ స్టిములేటింగ్ హార్మోన్ ఓవ్యులేషన్ (అండోత్సర్గం) ను వృధ్ధి చేసి, ఒవరీలు (అండకోశాలు) ఈస్ట్రోజెన్ మరియు ప్రోజెస్టరోన్ ఉత్పత్తి చేసేలాగ ప్రేరేపిస్తాయి. ఈస్ట్రోజెన్ మరియు ప్రోజెస్టరోన్ యుటెరస్ (గర్భాశయం లేక గర్భ సంచి) నీ, వక్షోజాలనూ జరగబోయే ఫెర్టిలైజేషన్ (ఫలదీకరణ) కి సిధ్ధం చేస్తాయి.



ఋతుచక్రం - దశలు

ఋతుచక్రంలో మూడు దశలు ఉంటాయి:

  1. ఫాలికులర్ (అండం విడుదల ముందు)
  2. ఓవ్యులేటరీ (అండం విడుదల)
  3. ల్యుటియల్ (అండం విడుదల తరువాత)

                         menstrual3.jpg
ఫాలిక్యులర్ దశ :

ఈ దశ బహిష్టు మొదటి రోజుతో మొదలౌతుంది. కానీ ఈ దశలో ముఖ్యమైన ఘట్టం ఒవరీలలో (అండాశయాలలో) ఫాలికల్స్ ఏర్పడడం..
ఫాలిక్యులర్ దశ మొదట్లో గర్భాశయపు లోపలి పొర (ఎండోమెట్రియం) మందం గా ఉండి పిండాన్ని పోషించడానికి అవసరమయ్యే పోషకాలనూ, ద్రవాలనూ కలిగి ఉంటుంది. అండం ఫలదీకరణ చెందకపోతే ఈస్ట్రోజెన్ మరియు ప్రోజెస్టరోన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా ఎండోమెట్రియం పై పొరలు కరిగి పోయి రక్త స్రావం జరుగుతుంది. ఈ సమయంలోనే పిట్యూటరీ గ్రంధి ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ స్థాయిని కొద్దిగా పెంచుతుంది. అప్పుడు ఈ హార్మోన్ 3 నుంచి 30 దాకా ఫాలికల్స్ ఏర్పడేలా చేస్తుంది. ఒక్కొక్క ఫాలికల్ లో ఒక్కొక్క అండం ఉంటుంది. ఈ దశ చివరలో ఈ హార్మోన్ స్థాయి తగ్గిపోయి, ఉన్న ఫాలికల్స్ లో ఒక్క ఫాలికల్ (డామినేటింగ్ ఫాలికల్ – ప్రబలమైనది) మాత్రం పెరిగి ఈస్ట్రోజెన్ ను ఉత్పత్తి చెయ్యడం మొదలు పెడ్తుంది. క్రమంగా తక్కిన ప్రేరేపిత ఫాలికల్స్ విఛ్ఛిన్న మవడం మొదలు పెడ్తాయి.

ఈ ఫాలిక్యులార్ దశ సగటున 13 లేక 14 రోజులు ఉంటుంది. ఈ మూడు దశలలో, నిడివి పరంగా అధికంగా మార్పులకు గురయ్యేది ఈ దశే. మెనోపాజ్ దశలో ఈ దశ యొక్క కాలం కుంచించుకుపోతుంది. ల్యుటినైజింగ్ హార్మోన్ స్థాయి ఆకస్మికంగా పెరిగినప్పుడు ఈ దశ పూర్తవుతుంది. ఈ ఆకస్మిక పెరుగుదల అండం విడుదలయ్యే లా చేస్తుంది. (ఓవ్యులేషన్ – అండోత్సర్గం)



ఓవ్యులేటరీ దశ

ల్యుటినైజింగ్ హార్మోన్ స్థాయి ఆకస్మికంగా పెరిగినప్పుడు ఈ దశ మొదలౌతుంది. ల్యుటినైజింగ్ హార్మోన్, డామినెంట్ (ప్రబలమైన) ఫాలికల్ అండకోశం ఉపరితలం నుంచి వుబికి వచ్చి, పగిలి, అండం విడుదల చేసేలాగ ప్రేరేపిస్తుంది. ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ స్థాయి కొద్దిగా మాత్రమే పెరుగుతుంది. ఈ పెరుగుదల వల్ల వుపయోగమేమిటొ ఇంకా తెలియ లేదు.
ఈ ఓవ్యులేటరీ దశ సాధారణంగా 16 నుండి 32 గంటల వరకూ ఉంటుంది. అండం విడుదలతో ఈ దశ పూర్తవుతుంది.

అండం విడుదలైన 12 నుంచి 24 దంటల తరువాత, ల్యుటినైజింగ్ హార్మోన్ యొక్క ఆకస్మిక పెరుగుదల ను మూత్ర పరీక్ష ద్వారా కనిపెట్టవచ్చు. దీని ద్వారా స్త్రీలలో గర్భధారణకు అనుకూలంగా ఉండే సమయాన్ని గుర్తించ వచ్చు. అండం విడుదలైన 12 గంటల వరకూ మాత్రమే ఫలదీకరణ చెంద బడుతుంది. అండం విడుదలవడానికి ముందే పునరుత్పత్తి నాళిక లో వీర్యం ఉన్నట్లైతే ఫలదీకరణ జరిగే అవకాశం ఎక్కువ.
ఓవ్యులేషన్ (అండోత్సర్గం) జరిగే సమయంలో కొంత మంది మహిళలకు పొత్తి కడుపులో ఒక పక్కన నొప్పిగా ఉంటుంది. దీనిని మిడిల్ పెయిన్ అంటారు. ఇది కొన్ని నిమిషాల నుండి కొన్ని గంటల పాటు ఉంటుంది. ఈ నొప్పి అండాశయం ఎటు వైపు అండాన్ని విడుదల చేసిందో అటువైపునే వస్తుంది. కానీ దీనికి కారణమేమిటో ఖచ్చితంగా తెలియదు. ఈ నొప్పి ఫాలికల్ పగిలే ముందు కానీ తరువాత కానీ ఉంటుంది. కానీ ఇది ప్రతి సారీ ఉండక పోవచ్చు. అండం విడుదల ఒకసారి ఒక ఓవరీ నుండి తరువాత సారి రెండో ఓవరీ నుండీ కాక ఎదో ఒక వైపు విడుదలౌతుంది. ఒక ఓవరీ కనుక తీసివేస్తే రెండో ఓవరీ నెల కొక అండాన్ని విడుదల చేస్తుంది.



ల్యుటియల్ ఫేజ్

ఈ దశ ఓవ్యులేషన్ (అండోత్సర్గం) తరువాత మొదలౌతుంది. ఇది 14 రోజుల వరకూ ఉండి (ఫలదీకరణ జరుగక పోతే) బహిష్టు ముందు పూర్తవుతుంది. ఈ దశలో, అండం విడుదల చేశాక ఫాలికల్ మూసుకొని పోయి కార్పస్ ల్యుటియం అనే ఆకారం గా మారుతుంది. ఒక వేళ ఫలదీకరణ జరిగితే అందుకు అనుగుణంగా ఇది గర్భాశయాన్ని సిధ్ధం చేస్తుంది. ఈ కార్పస్ ల్యుటియం ఎక్కువ మోతాదులో ప్రోజెస్టరోన్ ను ఉత్పన్నం చేసి రాబోయే పిండం కోసం గర్భాశయపు లోపలి పొరను (ఎండోమెట్రియం) ద్రవాలతోనూ, పోషకాలతోనూ నింపి దళసరిగా తయారు చేస్తుంది. ఈ ప్రోజెస్టరోన్, గర్భాశయం లోనికి వీర్యం కానీ, బాక్టీరియా కానీ ప్రవేశించ కుండా సెర్విక్స్ (గర్భాశయ ద్వారం) లోని మ్యూకస్ (బంక లాంటి పదార్ధం) గట్టి పడేటట్లు చేస్తుంది. ఈ ల్యుటియల్ దశలో ప్రోజెస్టరోన్ శరీర ఉష్ణోగ్రత ను కొద్దిగా పెంచి బహిష్టు మొదలయ్యే వరకూ అలాగే ఉంచుతుంది. ఈ పెరిగిన ఉష్ణోగ్రత కూడా ఓవ్యులషన్ (అండోత్సర్గం) జరిగిందీ లేనిదీ తెలుసుకోవడానికి ఉపయోగ పడుతుంది. ల్యుటియల్ దశలో చాలా వరకూ ఈస్ట్రోజన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజన్ కూడా ఎండోమెట్రియం ను మందంగా చేస్తుంది.

పెరిగిన ఈస్ట్రోజన్ మరియు ప్రోజెస్టరోన్ స్థాయిలు వక్షోజాలలోని క్షీర వాహికలను (మిల్క్ డక్ట్స) వ్యాకోపింప చేస్తాయి. ఫలితంగా స్తనాలు ఉబ్బి నొప్పిగా అని పిస్తాయి.
అండం ఫలదీకరణ చెందక పోతే 14 రోజుల తరువాత కార్పస్ ల్యుటియం శిధిల మై పోయి మళ్ళీ కొత్త ఋతు చక్రం మొదలౌతుంది. ఒక వేళ అండం కనుక ఫలదీకరణ చెందితే పెరుగుతున్న అండం చుట్టూ ఉన్న కణాలు వృధ్ధి చెంది హ్యూమన్ కోరియన్ గొనాడోట్రోపిన్ అనే హార్మోన్ ను ఉత్పత్తి చెయ్యడం మొదలు పెడ్తాయి. ఈ

హార్మోన్ కార్పస్ ల్యుటియం ను కాపాడుతూ ఉంటే, కార్పస్ ల్యుటియం పిండం తన హార్మోన్లు తాను తయారు చేసుకొనే వరకూ ప్రోజెస్టరోన్ ను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఈ హ్యూమన్ కోరియన్ గొనాడోట్రోపిన్ పెరుగుదలను గుర్తించడం మీదే గర్భధారణ పరీక్షలు ఆధార పడి ఉన్నాయి.









Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: