|
జీవన సత్యాలపై అత్యవసరమైన సందేశాలు కాచివడపోసిన జీవన సత్యాలపై అతి
ముఖ్యమైన సందేశాలు ఈ దిగువన ఇస్తున్నాం.
- మహిళలు, పిల్లల ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగు పరచాలంటే 3 సూత్రాలు
పాటించాలి.
-
మొదటిది – మహిళలు 18 ఏళ్ల వయస్సు కన్నా ముందు 35 ఏళ్ల వయస్సు తర్వాత
గర్భం ధరించరాదు.
రెండోది – బిడ్డకు, బిడ్డకు మధ్య అంటే కాన్పుల మధ్య కనీసం రెండు
సంవత్సరాల వ్యవధి ఉండాలి.
మూడో సూత్రం – మహిళ నాలుగుసార్ల కన్నా ఎక్కువ, గర్భం దాల్చరాదు.
- గర్భిణీ స్త్రీలందరూ తమ సమీపంలోని ఆరోగ్య కార్యకర్తను
సంప్రదించి, గర్భస్థ శిశు సంరక్షణకు, తోడ్పడాలి. శిక్షణ పొందిన వారి
సమీక్షంలోనే కాన్పు చేయించాలి. గర్భస్థ దశలో ఎదురుకో గల సమస్యలు,
హెచ్చరిక సంకేతాల గురించి గర్భిణితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా అవగాహన
కలిగి ఉండాలి. సమస్య తలెత్తితే వెంటనే నిపుణుల సహాయం తీసుకొనేలా
ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి.
- జన్మించిన మరుక్షణం నుంచే శిశువులు నేర్చుకోవటం మొదలు పెడతారు. చక్కని
పోషకాహారం, తగినంత ఆరోగ్య సంరక్షణతో పాటు తల్లిదండ్రుల నుంచి ప్రేమ,
వాత్సాల్యం, ఏకాగ్రత అందినట్లయితే పిల్లలు త్వర త్వరగా పెరిగి
నేర్చుకుంటారు. పరిసరాలను గమనించి, భావ వ్యక్తీకరణ చేసేలా పిల్లల్ని
ప్రోత్సహించాలి. వారు ఆటలాడుకోవటానికి, వారంతట వారే కొత్త విషయాలు
తెలుసుకొనేలా ఉత్సాహపరచాలి. తద్వారా పిల్లల్లో మానసిక వికాసం కలుగుతుంది.
శారీరకంగా, సామాజికంగా ఎదుగుతారు.
- పుట్టిన ఆరునెలల వరకు శిశువుకు ఆహారంగా గానీ, పానీయంగా గానీ తల్లి
(రొమ్ము) పాలు మాత్రమే అవసరమవుతాయి. ఆరునెలల తరువాత నుంచి తల్లి పాలకు
అదనంగా ఇతర ఆహారాన్ని కూడా శిశువుకు ఇవ్వాలి.
- శిశువు తల్లి గర్భంలో ఉన్నపుడు గానీ, రెండు సంవత్సరాల వయస్సు
వరకు గానీ పోషకాహారం లోపించినట్లయితే, ఆ పిల్లలు శారీరక, మానసిక
ఎదుగుదల నెమ్మదిగా ఉంటుంది. బిడ్డ పుట్టినప్పటి నుంచి రెండేళ్ల
వయస్సు వరకు ప్రతినెలా వారి బరువు ఎంతో చూడాలి. 2 నెలల వరకు కూడా బిడ్డ
బరువులో పెరుగుదల లేకపోతే, ఏదో లోపం ఉన్నట్లుగా భావించాలి.
- శిశువుకు మొదటి ఏడాది లోపే ఒకదాని తర్వాత మరొకటి టీకా మందులు
(ఇమ్యునైజేషన్) ఇప్పించాలి. బిడ్డ పెరుగుదలను దెబ్బతీసే, వైకల్యానికి లేదా
మరణానికి దారితీసే వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షించడానికి
ఇమ్యునైజేషన్ చాలా అవసరం. గర్భం దాల్చే వయస్సు లో ప్రతి మహిళ కూడా టెటనస్
వ్యాధి నుంచి రక్షణగా టీకా మందు వేయించుకోవాలి. ఒకవేళ ఆ మహిళ గతంలోనే
టీకామందు తీసుకున్నప్పటికీ, ఆ విషయాన్ని ఆరోగ్య కార్యకర్త
నిర్ధారించాలి.
- నీళ్ల విరోచనాలు (డయేరియా) కు సరైన శిశువు తల్లిపాలు, పండ్ల రసాలు,
ఉప్పు, చక్కెర కలిపిన నీళ్లు (ఒ.ఆర్.ఎస్) లాంటి ద్రవాలను ఎక్కువగా తాగాలి.
విరోచనాల్లో రక్తం పడినా లేదా నీళ్లలాగా తరచూ దొడ్డికి పోయినా, ఆ శిశువు
ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించి వెంటనే ఆ శిశువును చికిత్స కోసం సమీపంలోని
ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి.
- దగ్గు, జలుబు చేసిన చాలా మంది పిల్లలు తమంతట తామే కోలుకుంటారు. ఒకవేళ,
దగ్గు కారణంగా శిశువు విపరీతమైన శ్వాస తీసుకుంటున్నా లేదా శ్వాస తీసుకోవటం
కష్టమైనా, ఆ శిశువు ప్రమాదంలో ఉన్నట్లు భావించాలి. వెంటనే చికిత్సకోసం
సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.
- చక్కని పరిశుభ్రమైన అలవాట్లతో చాలా రకాల అనారోగ్యాలను, నిరోధించవచ్చు.
శుభ్రమైన మరుగుదొడ్లు, మూత్రశాలలను వినియోగించటం, సబ్బు లేదా బూడిదతో
రుద్ది శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవటం, సురక్షితమైన మంచి నీటినే
తాగటం, ఆహారాన్ని, నీటిని పరిశుభ్రంగా ఉంచటం లాంటి అలవాట్లు అనారోగ్యాన్ని
దరిచేరనీయవు.
- దోమలు కుట్టడం ద్వారా సంక్రమించే మలేరియా వ్యాధి వల్ల మరణం కూడా
సంభవించవచ్చు. మలేరియా వ్యాధి ఉన్న ప్రాంతాల్లో దోమ తెరలను ఉపయోగించాలి.
సిఫారసు చేయబడ్డ క్రిమి సంహారక మందుతో ఈ దోమ తెర తయారై ఉండాలి.
పిల్లలెవరైనా జ్వరంతో బాధపడితే శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తచే పరీక్ష
చేయించాలి. ఆరోగ్య కార్యకర్త సలహామేరకు గర్భవతులు యాంటి-మలేరియా మాత్రలను
తీసుకోవాలి.
- ఎయిడ్స్ వ్యాధి ప్రాణాంతకమైనది అయినప్పటికీ నివారించదగ్గది. ఎయిడ్స్
వ్యాధిని కలుగుజేసే హెచ్.ఐ.వి. వైరస్ అసురక్షిత (కండోమ్స్ లేకుండా) లైంగిక
చర్యల ద్వారా వ్యాపిస్తుంది. అంతేకాక, తగిన విధంగా స్క్రీన్ చేయకుండా ఒకరి
రక్తాన్నిఇంకొకరికి ఎక్కించటం, సిరంజీలు, సూదులు మలినం అయిన వాటిని
వాడడంవల్ల కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. హెచ్.ఐ.వి. తో వున్న మహిళ
గర్బంతో ఉంటే, ఆ వ్యాధి ఆమె శిశువుకు లేదా ఆమె రొమ్ముపాలు తాగిన
శిశువులకు కూడా వ్యాపిస్తుంది. హెచ్.ఐ.వి / ఎయిడ్స్ గురించి ప్రతి
ఒక్కరూ తెలుసుకొని తీరాలి. లైంగిక చర్యల ద్వారా అంటుకొనే ఈ
వ్యాధిని సురక్షితమైన శృంగారంతో నివారించవచ్చు. హెచ్.ఐ.వి. తో వున్న
లేదా ఆ వైరస్ కు గురికాగల మహిళలు సమీపంలోని ఆరోగ్య కార్యకర్తను
సంప్రదించి తమ గర్భస్థ శిశువులకు ఈ వ్యాధి వ్యాపించకుండా, తమ ఆరోగ్య
పరిరక్షణకు సంబంధించిన సమాచారాన్ని సలహాలను పొందాలి. వ్యాధి పరీక్షలు
జరిపే కేంద్రాల గురించి కూడా ఆరోగ్య కార్యకర్త తెలియజేస్తారు.
- తీవ్రమైన గాయాలు గానీ, ప్రమాదాలు గానీ అత్యధికం నివారించదగినవే.
తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లల కదలికలపై ఒక కన్నేసి ఉంచాలి.
పిల్లలకు అందుబాటులో ప్రమాదకరమైన వస్తువులేమీ లేకుండా పరిసరాలను
సురక్షితంగా ఉంచాలి.
- విపత్తులు లేదా అత్యవసర పరిస్థితుల్లో పిల్లలు తొలుత సూక్ష్మ
పోషకాహారం, మీజిల్స్ టీకాలతో సహా అత్యవసర ఆరోగ్య సేవలను పొందాలి.
ఆరోగ్య పరంగా బాగా ఒత్తిడి వున్న పరిస్థితుల్లో పిల్లలు తమ తల్లిదండ్రులు
లేదా కుటుంబంలోని వయోజనుల సంరక్షణలో ఉండటం శ్రేయస్కరం. శిశువులకు
తల్లిపాలు అందేలా చూడటం ఈ పరిస్థితుల్లో చాలా అవసరం.
|