ఓపెన్‌బుక్ సిస్టం
ఇక చూసి రాసే పరీక్షలు!
ఫిబ్రవరిలో ప్రయోగాత్మకం
నాలుగో యూనిట్ టెస్ట్‌లో అమలు
పరిశీలిస్తున్న అధికారులు
ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు ఇకపై పుస్తకాలు చూసి మరీ పరీక్షలు(ఓపెన్‌బుక్ సిస్టం) రాసే అవకాశాన్ని కల్పించబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4, 5 తరగతుల విద్యార్థులకు ఫిబ్రవరిలో నిర్వహించే నాలుగో యూనిట్ పరీక్షలో మాత్రమే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేసే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. తొలుతగా తెలుగు, ఆంగ్ల సబ్జెక్టులకు మాత్రమే వర్తింప చేయాలని భావిస్తున్నారు. ఈ విధానంపై ఉపాధ్యాయులకు రాజీవ్ విద్యామిషన్ అధికారులు అవగాహన కల్పించారు. విద్యార్థి పరీక్ష హాలులోకి సంబంధిత పాఠ్య పుస్తకాన్ని తీసుకెళ్ళి ప్రశ్నలకు సమాధానాల్ని విశ్లేషణాత్మకంగా సొంతశైలిలో రాసే విధానాన్ని పుస్తకాధారిత పరీక్షలుగా వ్యవహరిస్తున్నారు. ఈ విధానం ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ప్రశ్న పత్రం రూపకల్పనలో విద్యార్థుల జ్ఞాపకశక్తిని పరిగణనలోకి తీసుకోరు. విద్యార్థుల అవగాహన స్థాయి, ఆలోచనాశక్తి, వివిధ సందర్భాల్లో అన్వయ సామర్థ్యాలను పరిశీలించేదిగా ఉంటుంది. పుస్తకంలోని విషయాన్ని అర్థం చేసుకొని సమాధానం రాయడం తేలికైన విషయం కాదని, బట్టీ పట్టేలా చదవడం కంటే కష్టంగా ఉంటుందని రాజీవ్ విద్యామిషన్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దీనిపై మరోసారి విస్తృత స్థాయిలో చర్చించి ఖరారు చేస్తామని వెల్లడించారు.
ఆధారం : ఈనాడు.








